టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage)కి సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు నిరంతరం ఆందోళన చేస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓయూ విద్యార్థి సంఘాల చేపట్టిన మహానిరుద్యోగ దీక్ష తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలోనూ అదే పరిస్థితి నెలకొంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాల నాయకులు నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
కాగా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభకు భారీగా విద్యార్థులు తరలివచ్చారు. సభ రద్దు కావడంతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు విద్యార్థులు యత్నించారు. కేయూ అడ్మినిస్ట్రేషన్ భవనాన్ని ముట్టడించేందుకు కేయూ జేఏసీ విద్యార్థులు యత్నించారు. పరిపాలన భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడున్న పూల కుండీలను విద్యార్థి సంఘాల నాయకులు ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అడ్యినిస్ట్రేషన్ భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.