AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ ఇక సభకు రానట్లేనా.. సంతాప తీర్మానానికి డుమ్మా.. బీఆర్ఎస్‌లో అసంతృప్తి?

దివంతగ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సంతాపం తెలియజేసే అంశానికి పరిమితమై ఒక రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించినా కేసీఆర్ గైర్హాజరు కావడం రాజకీయ చర్చకు దారి తీసింది. విమర్శలు, ప్రతివిమర్శలకు తావు లేని తీరులో జరిగిన ఈ సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టడం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలోనే హాట్ టాపిక్ అయింది. మన్మోహన్‌ సింగ్ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పనిచేయడంతో పాటు ఆయన హయాంలోనే తెలంగాణ ఏర్పడినా ఇప్పుడు సంతాప తీర్మానంపై జరిగే చర్చలో ఆయన పాలుపంచుకోకపోవడంతో కేసీఆర్ చిత్తశుద్ధి ఇదేనా అనే ప్రశ్నలూ ఉత్పన్నమయ్యాయి.

అయితే, కేసీఆర్‌కు ఈ సభ ఏం గౌరవం ఇచ్చిందా అంటూ ఎమ్మెల్యే హరీశ్‌ రావు కామెంట్ చేయడం వెనుక ‘కేసీఆర్ ఇక సభకు ఎప్పటికీ రారు’ అనే సంకేతాన్ని ఇచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి. మన్మోహన్ సింగ్ మరణవార్త తెలిసిన వెంటనే సంతాప సందేశంలో ఆయన కృషిని కొనియాడిన కేసీఆర్, జరిగిన అంత్యక్రియలకు హాజరు కాకుండా కేటీఆర్‌ను పంపడం, కనీసం అసెంబ్లీలో జరిగే చర్చకైనా ఆయన హాజరు కాకపోవడం, ఈ సభ ఏం గౌరవం ఇచ్చిందంటూ హరీశ్‌ రావు కామెంట్ చేయడం, వీటన్నింటితో కేసీఆర్ ఈ సభకు హాజరయ్యే ఉద్దేశం లేదనే అంశాన్ని పరోక్షంగా చెప్పినట్లయిందనే మాటలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచే వినిపిస్తున్నాయి. సభకు హాజరై ఉండి ఉంటే బాగుండేదని, అలా హాజరు కాకపోవడం ద్వారా విమర్శలకు తావు ఇచ్చినట్లయిందని, రాజకీయంగా బీఆర్ఎస్‌కు నష్టం జరుగుతుందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మధ్యే జరుగుతున్నాయి.

హరీశ్‌ రావు ఏమన్నారంటే?
మన్మోహన్‌ సింగ్ సంతాప తీర్మానంపై చర్చలో భాగంగా కేసీఆర్ గురించి హరీశ్‌ రావు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని నిర్దిష్ట అంశానికే పరిమితం కావాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో స్పీకర్ వివరణ ఇస్తూ సంతాప తీర్మానంపై జరిగే చర్చలో పాల్గొనాల్సిందిగా స్వయంగా తానే కేసీఆర్‌కు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశానని అని సభకు తెలియజేశారు.

దీనికి హరీశ్‌ రావు స్పందించి “ఆ విషయంలో మేం కూడా చాలా మాట్లాడాల్సి వస్తుంది.. ఈ సభ కేసీఆర్‌కు ఏం గౌరవం ఇచ్చింది? సభలో కేసీఆర్ మాట్లాడాలనే అనుకుంటున్నారు కానీ ఈ సభ ఒక సభ లాగా నడుస్తలేదు. పీఏసీ (పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ) చైర్మన్ నియామకం విషయంలో ఇష్టమొచ్చినట్లు నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌కు గౌరవం ఇచ్చి ఆయనను అడిగి నిర్ణయం తీసుకున్నారా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న విషయంలో కేసీఆర్‌ను అడిగి నిర్ణయం తీసుకున్నారా?” అంటూ కామెంట్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10