ఆధునికతకు ప్రతీక.. తెలంగాణ నూతన సచివాలయం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. ఈ నెల 30న ప్రారంభానికి ముస్తాబవుతోంది. గ్రౌండ్ ప్లస్ సిక్స్ ఫ్లోర్లతో కూడిన ఈ భవనం అద్భుతమైన కట్టడంగా కనువిందు చేస్తోంది. ఈ భవనంలోని ఆరో అంతస్తులో సీఎం ఆఫీసు ఉంటుంది. తూర్పు ముఖంగా ఉన్న భవనంలో నైరుతి మూలన సీఎం ఛాంబర్ ఉంటుంది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా దాదాపు 100 ఏళ్లు మనగలిగేలా ఈ సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ పేరును ఈ భవనానికి పెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. వాన నీటిని ఒడిసిపట్టేందుకు ఈ భవనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీన్ని ఆనుకొని ప్రత్యేకంగా ఒక చిన్న రిజర్వాయర్ నిర్మించారు. సంప్రదాయం, ఆధునికతలకు కలబోతగా ఈ భవనం ఉండనుంది. దీనిపై ఏర్పాటు చేసిన డోమ్స్ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
తెలంగాణ సెక్రటేరియట్ మొత్తం విస్తీర్ణం 28 ఎకరాలు. ఇందులో 10, 51,676 చదరపు అడుగుల్లో భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ఎత్తు 265 అడుగులు. దేశంలోనే అతి ఎత్తైన భవనాల్లో ఇది ఒకటి. ఈ భవనంపై ఏర్పాటు చేస్తున్న జాతీయ చిహ్నాన్ని కూడా కలిపితే మొత్తం ఎత్తు 278 అడుగులవుతుంది. 11 అంతస్తుల ఎత్తులో ఈ భవనం కనిపిస్తుంది కాని ఇందులో ఉన్నవి ఆరు అంతస్తులు మాత్రమే. డెక్కన్, కాకతీయ శైలిలో నిర్మించిన ఈ భవనానికి 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణ. తెలంగాణ సంప్రదాయంతో పాటు ఆధునిక హంగులతో దీన్ని నిర్మించారు. సరికొత్తగా మరిన్ని మెరుగులద్దారు. ఇప్పుడు అది రాత్రిళ్లు వజ్రంలా మెరుస్తోంది. అందర్నీ కట్టిపడేస్తోంది. సరికొత్త కాంతులతో ఆకట్టుకుంటోంది. చూపు తిప్పుకోనివ్వని రేంజ్‌లో ఉంది. దానికి సంబంధించిన ఫొటోలు చూసేయండి మరి..














