AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బుకింగ్స్ లో ‘రామాయణ’ రికార్డ్స్..! ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ రికార్డులు బ్రేక్..

భారత సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ: పార్ట్ 1’ చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, టికెట్ అమ్మకాల్లో సరికొత్త ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పింది. ముఖ్యంగా ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మైషో’లో గంట వ్యవధిలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా నిలిచి, ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.

విడుదలకు ముందు ‘ధురంధర్ 2’ చిత్రంతో పోలిస్తే ‘రామాయణ’కు అడ్వాన్స్ బుకింగ్స్ కొంత బలహీనంగానే మొదలయ్యాయి. అయితే, సినిమా విడుదలైన తర్వాత మంచి స్పంద‌న‌తో పుంజుకుంది. దీపావళి పండుగ సెలవులు ఈ చిత్రానికి భారీగా కలిసొచ్చాయి. సినిమా విడుదలైన ఐదవ రోజైన ఇవాళ‌ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కేవలం గంట వ్యవధిలో 1.10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. 2023 ఆగస్టు నుంచి అందుబాటులో ఉన్న గంటలవారీ ట్రాకింగ్ రికార్డుల్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘రామాయణ’ నిలిచింది.

ఇప్పటివరకు ఈ రికార్డు రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ (1.09లక్ష‌లు) పేరిట ఉండేది. అంతకుముందు అల్లు అర్జున్ ‘పుష్ప 2’ (1.07లక్ష‌లు) పేరిట ఉన్న రికార్డును ‘ధురంధర్ 2’ అధిగమించింది. ఇప్పుడు ఆ రెండు చిత్రాల రికార్డులను ‘రామాయణ’ చెరిపేసి అగ్రస్థానానికి చేరింది. దీపావళి సెలవుల కారణంగా నిన్న‌టి కంటే ఈ రోజు టికెట్ అమ్మకాలు ఏకంగా 67% పెరగడం విశేషం. విడుదలైన మొదటి నాలుగు రోజులూ ప్రతిరోజూ 1 మిలియన్ (10 లక్షలకు పైగా) బుక్‌మైషో బుకింగ్స్ సాధించిన ఆరో భారతీయ చిత్రంగా కూడా ‘రామాయణ’ నిలిచింది.

నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ డ్రామాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటించారు. లక్ష్మణుడి పాత్రలో రవి దూబే కనిపించారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ, యశ్ సొంత నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రంలో సన్నీ డియోల్, అనుపమ్ ఖేర్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అరుణ్ గోవిల్, లారా దత్తా వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు.

ANN TOP 10