దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక పాత్ర పోషించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఆయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పే సమయం ఆసన్నమైందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ హడావిడి కొద్దిరోజులు మాత్రమేనని, ఆ తర్వాత మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన అంబర్పేట నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. తీవ్రమైన విద్యుత్ కోతల వల్ల రైతులు అల్లాడుతున్నారని, వారి కష్టాలను పట్టించుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఎల్నినో ప్రభావంపై నిపుణులు పది నెలల ముందే హెచ్చరించినప్పటికీ, ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి హడావిడి మరికొద్దిరోజులు మాత్రమే ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.
జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలే దేశంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని కేటీఆర్ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం ఉండదని, అటు ప్రధాని మోదీ పాలనలోనూ దేశానికి చేకూరిన ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ నుంచి గెలిచిన ఎంపీలెవరూ పార్లమెంటులో గళం విప్పడం లేదని ఆయన దుయ్యబట్టారు.
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు యువత తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే నేడు యువత రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి, కేవలం ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు.








