డిండి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే రద్దు చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పాలమూరు రైతులకు కేటాయించిన నీటిని డిండికి తరలించి, స్థానిక రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఈ ప్రాజెక్టును రద్దు చేయని పక్షంలో జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ఆమె హెచ్చరించారు. మహబూబ్నగర్లో పాలమూరు-రంగారెడ్డి పెండింగ్ ప్రాజెక్టులపై బీజేపీ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీకే అరుణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
జిల్లా ప్రజలకు మేలు చేయని సీఎం కుర్చీ రేవంత్ రెడ్డికి ఎందుకు? అని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్లో మార్పులు చేయడం ద్వారా రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్… ఆర్డీఎస్ కోసం చేసిందేమీ లేదని డీకే అరుణ దుయ్యబట్టారు. రైతులు, అసంపూర్తిగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందని ఆరోపించారు. పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ తక్షణమే పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పాలమూరు రైతుల నీటి హక్కులను కాపాడేందుకు బీజేపీ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు.








