AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌కు జగన్ మకాం..! అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం..!

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై ఉన్న సీబీఐ కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులను కూడా రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ వేగవంతం కానుంది.

ఈ కేసుల్లో జగన్‌తో పాటు మరో 70 మంది నిందితులను వ్యక్తిగతంగా విచారించాలని న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. జగన్‌పై దాదాపు దశాబ్దకాలంగా 9 ఈడీ ఛార్జిషీట్లు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఈడీ అధికారులు ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

సీబీఐ కోర్టులో నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పులు రాకపోవడంతో కేసుల విచారణ ముందుకు సాగడం లేదని ఈడీ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈడీతో పాటు మాజీ మంత్రి హరిరామజోగయ్య, మరికొందరు కూడా విచారణను వేగవంతం చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు తీసుకున్న తాజా నిర్ణయంతో జగన్‌పై ఉన్న కేసుల విచారణ ఇకపై వేగంగా ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది.

ANN TOP 10