లడఖ్‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పేర్లు ఖరారు చేయడంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్య చట్టవిరుద్ధమని చైనా ఆరోపించగా, భారత్ అత్యంత ఘాటుగా స్పందించింది. లడఖ్ భారత్‌లో విడదీయరాని అంతర్భాగమని, చైనా ఆరోపణలు ఈ వాస్తవాన్ని మార్చలేవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, లడఖ్ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. శిఖరాలు, కనుమలు, జలవనరులతో సహా మొత్తం 28 ప్రదేశాలకు ప్రామాణిక పేర్లను నిర్ణయించి, వాటిని సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్‌లో చేర్చనున్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాలకు సంబంధించి స్పష్టమైన గుర్తింపు, అవగాహన పెరుగుతుందని విదేశాంగ శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
తన భౌగోళిక రికార్డులను పటిష్ఠం చేసుకునేందుకే భారత్ ఈ చర్యలు చేపట్టింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందిస్తూ, భారత్ ఏకపక్షంగా ఏర్పాటు చేసిన ‘కేంద్రపాలిత ప్రాంతం లడఖ్’ను తాము ఎన్నడూ గుర్తించలేదని వ్యాఖ్యానించారు. “భారత్ ప్రకటించిన ప్రామాణిక పేర్లను మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ చర్య చట్టవిరుద్ధం, చెల్లదు. చైనా-భారత్ సరిహద్దులోని పశ్చిమ సెక్టార్‌లోని ఆ ప్రాంతాలు ఎల్లప్పుడూ చైనా భూభాగాలే” అని ఆమె వాదించారు.
చైనా వాదనలను భారత్ తీవ్రంగా ఖండించింది. “కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ భారత్‌లో విడదీయరాని అంతర్భాగం. ఈ సుస్థిర వాస్తవాన్ని చైనా ఎంతగా వ్యతిరేకించినా మార్చలేదు” అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది.







