AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏఐ డీప్‌ఫేక్, మార్ఫింగ్ ఫొటోలపై శ్రేయ ఫైర్..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ దుర్వినియోగంపై, ముఖ్యంగా డీప్‌ఫేక్, మార్ఫింగ్ ఫొటోలపై సీనియర్ నటి శ్రియ శరణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేస్తున్నారని, వాటిని చూసినప్పుడు ‘అసలు అక్కడ ఉన్నది నేనేనా?’ అనే సందేహం, ఆవేదన కలుగుతాయని ఆమె అన్నారు.

కొన్నిసార్లు తన శరీరాకృతిని అసహ్యంగా మార్చేస్తున్నారని, ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి చిత్రీకరిస్తున్నారని శ్రియ వాపోయారు. ఇది కొందరికి నవ్వులాటగా అనిపించవచ్చని, కానీ తనకు మాత్రం ఎంతో బాధ కలిగిస్తుందని చెప్పారు. గతంలో తాను కూడా ఇలాంటి మార్ఫింగ్ ఫొటోల బారిన పడ్డానని గుర్తు చేసుకున్నారు. ఏఐ టెక్నాలజీకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దానిని బాధ్యత లేకుండా వాడితే తీవ్రమైన ప్రమాదాలు తప్పవని, ఇలాంటి సాంకేతిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా తన 25 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని కూడా శ్రియ గుర్తు చేసుకున్నారు. 2001లో ‘ఇష్టం’ సినిమాతో కెరీర్ ప్రారంభించినప్పటి రోజులను తలుచుకున్నారు. అప్పట్లో కారవాన్లు ఉండేవి కావని, చెట్ల కింద కూర్చుని భోజనం చేస్తూ పుస్తకాలు, సంగీతం గురించి మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇయర్‌ఫోన్లతో తమ సొంత ప్రపంచంలో ఉంటున్నారని, కథలు చెప్పే విధానం కూడా పూర్తిగా మారిపోయిందని తెలిపారు.

పరిశ్రమలో మహిళల పాత్రపై కూడా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. నటీమణులుగా తెరపై కనిపించడం కంటే, తెర వెనుక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో మహిళలు ఉండటం ఎంతో అవసరమని ఆమె నొక్కి చెప్పారు. కథల ఎంపిక, పెట్టుబడుల వంటి కీలక అంశాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు. కేవలం మహిళా ప్రాధాన్య చిత్రాలు తీసి, తెర వెనుక కీలక పనులన్నీ పురుషులే చేస్తే దాన్ని మహిళా చిత్రం అని ఎలా అంటామని ప్రశ్నించారు. పరిశ్రమలో మార్పు ఇప్పుడిప్పుడే మొదలైందని, ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు.

ANN TOP 10