తెలుగుదేశ రాజకీయంలోనూ, జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఎప్పుడూ వేడి పుట్టిస్తుంటాయి. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల కమిషన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని హెచ్చరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ కలకలం రేపుతున్నాయి.
ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన వ్యవస్థల్లో పారదర్శకత తగ్గిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జ్ఞానేష్ గో బ్యాక్ పేరిట ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పారు.
దేశంలో జనాభా పెరుగుతున్నప్పటికీ ఓటర్ల సంఖ్య ఎలా తగ్గుతోందో రేవంత్ లెక్కలతో సహా నిలదీశారు. 2014లో 81 కోట్లు, 2019లో 91 కోట్లు, 2023 నాటికి 97 కోట్ల ఓట్లు నమోదు కాగా.. ఇప్పటికే దాదాపు 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆరోపించారు. బెంగాల్, బీహార్, మహారాష్ట్రల్లో ఓట్లను ఎక్కడైతే తొలగించారో, అక్కడ బీజేపీ గెలుస్తోందని మండిపడ్డారు.
ఈ పరిస్థితిపై రాష్ట్రపతి గానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గానీ ప్రధాని మోదీని ప్రశ్నించకపోవడం శోచనీయమన్నారు. బీజేపీ దేశంలో పౌరులను రెండు వర్గాలుగా విభజిస్తోందని దుయ్యబట్టారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి ఓటు హక్కు ఉంచి, ఇతరుల ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఓటు హక్కు కోల్పోతే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందకుండా పోతాయని హెచ్చరించారు.
దేశంలో బీజేపీ శాశ్వత విభజన తీసుకొస్తోందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇది మరో స్వాతంత్ర్య పోరాటం లాంటిదని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం ప్రజలందరూ ఏకమై పోరాడాలని ఆయన ఉద్ఘాటించారు.







