AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుపతికి చంద్రబాబు భారీగా నిధులు..! వేల కోట్ల ప్రాజెక్టులకు చంద్రబాబు శంకుస్థాపన..

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం మొదలైంది. ‘తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ’ (తుడా) పరిధిలో సుమారు రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శ్రీకారం చుట్టారు. అమరావతి సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ఆయన ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా భక్తులకు సమగ్ర సమాచారం అందించేందుకు రూపొందించిన ‘వెంకటాద్రి’ యాప్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ ఎం. రవిచంద్ర, పాలకమండలి సభ్యులు, తిరుపతి జిల్లా కలెక్టర్, ‘తుడా’ అధికారులు పాల్గొన్నారు.

భక్తుల సౌకర్యార్థం ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్
తిరుమలపై రద్దీని తగ్గించి, భక్తులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో అలిపిరి వద్ద భారీ ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా రూ.1,332 కోట్లతో యాత్రికుల కోసం వసతి సముదాయాలు నిర్మించనున్నారు. నాలుగు బ్లాకుల్లో 2,700 గదులు అందుబాటులోకి రానుండగా, రోజుకు 15 వేల మందికి పైగా భక్తులు బస చేసే వీలుంటుంది. 

రూ.160 కోట్లతో నిర్మించే నూతన అన్నప్రసాద కేంద్రంలో ఒకేసారి 6 వేల మంది భక్తులు భోజనం చేయవచ్చు. వీటితో పాటు రూ.486 కోట్లతో నాలుగు పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తారు. వీటిలో ఒకేసారి 16 వేల మంది భక్తులు విశ్రాంతి తీసుకోవచ్చు. రూ.311 కోట్లతో 4,500 వాహనాలు నిలిపేలా బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం, రూ.90 కోట్లతో 30 బస్ బేలతో కూడిన ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ కూడా ఈ టౌన్‌షిప్‌లో భాగంగా ఉండనున్నాయి.

టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న టీటీడీ ఉద్యోగుల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 418 ఎకరాల విస్తీర్ణంలో 5,192 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయించే లేఅవుట్ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ లేఅవుట్‌లో అంతర్గత బీటీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.230 కోట్లు వెచ్చించనున్నారు.

మాస్టర్ ప్లాన్ రహదారులతో మారనున్న రూపురేఖలు
తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రూ.242 కోట్ల వ్యయంతో 9 మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణ పనులను కూడా సీఎం ప్రారంభించారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే నగరంలో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. ప్రత్యేకించి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి మూడు కొత్త మాస్టర్ ప్లాన్ రహదారులను నిర్మించనున్నారు. ఈ సమగ్ర ప్రాజెక్టుల ద్వారా తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా మాత్రమే కాకుండా, అత్యుత్తమ మౌలిక వసతులున్న నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ANN TOP 10