AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీ నిరసనలపై కేంద్రం ఆంక్షలు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!

ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలకంగా స్పందించింది. ఈ నెల 9న ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌పై ఆదివారం ప్రత్యేకంగా విచారణ చేపట్టనుంది. నిరసనల సమయంలో ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేయకూడదని కోర్టు స్పష్టం చేసినప్పటికీ.. ఆంక్షలు కొనసాగించారన్నది పిటిషనర్‌ ఆరోపణ.

జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్‌ వి.మోహనతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌తో పాటు, నిరసనల సమయంలో పలువురిని నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో పిటిషన్‌నూ ధర్మాసనం పరిశీలించనుంది.

నిరసనకారుల నిర్బంధంపైనా విచారణ
ఢిల్లీలో శనివారం జరిగిన నిరసనల సందర్భంగా ప్రతిపక్ష నేతలను ముందస్తుగా నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, సీనియర్‌ న్యాయవాది మేనకా గురుస్వామి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. నలుగురు మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రతిపక్ష నేతలను నిర్బంధించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును అణచివేయడానికి ముందస్తు నిర్బంధాన్ని ఉపయోగించకూడదని ఆమె వాదించారు. నిరసనకారులను రోడ్లపై నుంచి, ప్రతిపక్ష నేతలను వారి ఇళ్ల నుంచి పోలీసులు తీసుకెళ్లడంపైనా ప్రశ్నించారు.

ముగ్గురు ఉన్నతాధికారులపై చర్యలు కోరుతూ పిటిషన్‌
కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ కుమార్‌, ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) ఛైర్‌పర్సన్‌ డి.థారాపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని త్రిపాఠి కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని ఆరోపించారు.

మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలపై కోర్టు ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.

అక్టోబర్‌ 9న సుప్రీంకోర్టు ఏమంది?
ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టనున్న నేపథ్యంలో 57 మెట్రో స్టేషన్లను మూసివేయాలని ఢిల్లీ పోలీసులు సూచించారు. న్యూఢిల్లీ, హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్లకు వచ్చే మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపైనా ఆంక్షలు విధించారు. ఆ తర్వాత డీఎంఆర్‌సీ మూసివేతల సంఖ్యను 45కి తగ్గించింది.

ఈ ఆంక్షలపై విచారణ సందర్భంగా ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేయడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకుని సేవలను నియంత్రించవచ్చని, కానీ పూర్తిగా నిషేధించకూడదని స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ముందుగానే ట్రాఫిక్‌ సూచనలు ఇవ్వాలని, శాంతియుత నిరసనలకు తగిన సౌకర్యాలున్న ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాలు అమలయ్యాయా లేదా అన్నది ఆదివారం విచారణలో కీలకంగా మారనుంది.

ANN TOP 10