AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మా ఇల్లు మాకిప్పించండి… కుటుంబం కోసం కలెక్టర్‌నే నిలదీసిన 13 ఏళ్ల బాలుడు..!

ఆ పిల్లాడి వయసు 13 ఏళ్లు. ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కానీ, కుటుంబం పట్ల అతని బాధ్యత, సమస్యను పరిష్కరించుకోవాలన్న అతని పట్టుదల చూసి జిల్లా స్థాయి అధికారులే ఆశ్చర్యపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఏకంగా జిల్లా మేజిస్ట్రేట్‌నే నిలదీశాడీ బాలుడు.

 

వివరాల్లోకి వెళితే.. లఖింపూర్ ఖేరికి చెందిన 13 ఏళ్ల అమితాబ్ గుప్తా, స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన “సంపూర్ణ సమాధాన్ దివస్” (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమానికి ఒంటరిగా వచ్చాడు. తమ ఉమ్మడి ఆస్తి అయిన ఇంట్లోని కొంత భాగానికి బంధువులు తాళం వేశారని, దానిని తొలగించాలని జిల్లా మేజిస్ట్రేట్ అంజనీ కుమార్ సింగ్‌ను కోరాడు.

 

తండ్రి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని, తల్లి ఇళ్లలో పనిచేస్తూ నెలకు కేవలం రూ.3,000 మాత్రమే సంపాదిస్తోందని బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరి, తన చదువుల ఖర్చులకు కూడా ఆ డబ్బు సరిపోవడం లేదని చెప్పాడు. తాళం వేసిన ఇంటి భాగాన్ని అద్దెకు ఇస్తే, ఆ వచ్చే డబ్బుతో తమ కుటుంబం గడుస్తుందని అధికారులకు వివరించాడు. గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు.

 

అధికారులు సమస్యను పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో, అమితాబ్ వారిని అడ్డుకున్నాడు. “పని చేస్తామని చెప్పకండి, త్వరగా చేసి చూపించండి” అంటూ అక్కడున్న ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో ధైర్యంగా చెప్పాడు. అధికారులు అతడిని చదువుపై దృష్టి పెట్టాలని సూచించగా.. “చదువుకోవాలంటే పుస్తకాలకు, ఇతర ఖర్చులకు డబ్బులు కావాలి కదా? ఈ సంపాదనతో ఎలా బతకాలి?” అని ఎదురు ప్రశ్నించాడు.

 

బాలుడి ధైర్యం, ఆవేదనను అర్థం చేసుకున్న జిల్లా మేజిస్ట్రేట్, అసభ్యకరంగా మాట్లాడొద్దని సూచిస్తూనే.. అతని సమస్యపై తక్షణం దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. వెంటనే ఆ ఇంటిని స్వయంగా సందర్శించి, విచారణ జరపాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బాలుడి ధైర్యాన్ని, కుటుంబం పట్ల అతని బాధ్యతను పలువురు ప్రశంసిస్తున్నారు.

ANN TOP 10