AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

2028 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగవు: సీఎం రేవంత్‌..

2028 డిసెంబర్‌లో ఎన్నికలు జరగవని, నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2029 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు. అప్పటికీ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు, పార్లమెంట్ స్థానాలు 17 నుంచి 25కు పెరుగుతాయని అన్నారు. 182 స్థానాల్లో కనీసం 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 65 సీట్లు గెలుస్తుందని తాము ముందే చెప్పి చేసి చూపించామని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘కేసీఆర్ ఇంట్లో ఒకరంటే ఒకరికి పడదు. కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతాం. పాపాల భైరవుడిని ఫామ్‌హౌస్‌లో బంధించాం. కాచుకో చంద్రశేఖర్ రావు.. జరగబోయే కురుక్షేత్రంలో గెలిచేది మేమే’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ను మళ్లీ మొలకెత్తనివ్వబోమని ప్రజలు సంకల్పించారని, పదేళ్ల రాక్షస పాలనకు ఇప్పటికే ముగింపు పలికారన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌లో ఉంటారో లేదో హరీశ్‌ రావే చెప్పాలి అన్నారు. బీజేపీతో మంతనాలు జరపడం లేదా అని ప్రశ్నించారు.

 

రైతు ఆశీర్వాద సభలో భాగంగా 1.44 లక్షల మంది రైతులకు రూ.1,009 కోట్ల రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లను ప్రారంభించాలని బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న డిమాండ్‌ను ఆయన తప్పుబట్టారు. అలా చేస్తే భద్రాచలం రామాలయం సహా 44 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని పేర్కొన్న రేవంత్.. ‘‘ఇప్పుడు వైర్లు పట్టుకుంటే కాలి బూడిదైపోతారు’’ అని వ్యాఖ్యానించారు.

ANN TOP 10