AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టినా బుద్ధిమారలే..

మీ చేసిన ఆరాచకాలను ప్రజలు ఎన్నటికీ మరువరు..
కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఫైర్‌
గులాబీ దళపతికి పీసీసీ చీఫ్‌ బహిరంగ లేఖ

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ తీవ్ర స్థాయిలో నిప్పులు కురిపించారు. కేసీఆర్‌ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఛీకొట్టినా బుద్ధిమారలేదన్నారు. కర్రుకాల్చి వాతపెట్టి, వారి పాలనకు చరమగీతం పాడినా ఆయన కుటుంబ సభ్యుల్లో, పార్టీ నేతల్లో ఎలాంటి మార్పూ రాలేదని టీపీసీసీ చీఫ్‌ విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కట్టబెడితే ఓర్వలేకే బీఆర్‌ఎస్‌ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే పంథాలో సాగితే ప్రజలు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు సర్కారుపై చేస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఆదివారం మహేశ్‌గౌడ్‌ బహిరంగ లేఖ రాశారు.

దళితుడిని సీఎం చేస్తానని చెప్పి..
‘తెలంగాణాలో మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పి తిమ్మిని బమ్మిని చేసి మీరే సీఎంగా అందలమెక్కారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఉద్యమించిన మీరు పీఠమెక్కాక మాయమాటలతో పాలించారు. కుటుంబ పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని మీ కుటుంబ సభ్యుల కబంధ హస్తాల్లో బంధించి, మీరు చేసిన ఆరాచకాన్ని ప్రజలు ఎన్నటికీ మరవలేరు.’ అని లేఖలో పేర్కొన్నారు.

బలిదానాలను ప్రోత్సహించింది హరీశ్‌రావు కాదా?
మీ అల్లుడు హరీశ్‌రావు పెట్రోల్‌ డబ్బాతో, అగ్గిపులతో డ్రామాలు చేసి అమాయక యువతను బలిదానాలవైపు ప్రోత్సహించారనేది వాస్తవం కాదా? అని కేసీఆర్‌ను మహేశ్‌ ప్రశ్నించారు. ‘ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మీ కుటుంబ రాజకీయ ఉపాధి కల్పించుకున్నారు. మీ హయాంలో ఇచ్చిన అరకొర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను పూర్తి చేయలేకపోయారు. నోటిఫికేషన్‌ ఇచ్చాక మీ అనుచరులతోనే కోర్టుల్లో కేసులు వేయించి ఉద్యోగాల భర్తీ చేపట్టలేదు. పదో తరగతి మొదలు గ్రూప్‌–1 పరీక్షల వరకు అన్నింటా అవకతవకలు, గందరగోళమే.’ అని పీసీసీ చీఫ్‌ గుర్తుచేశారు.

జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చిన ఘనత మాదే..
మీ పాలనకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఇచ్చిన మాట ప్రకారం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన ఘనత కాంగ్రెస్‌ నని స్పష్టంచేశారు. మీ హయాంలో అవినీతిమయమైన టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయడమే కాకుండా గ్రూప్‌ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో 54 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు నెలకొల్పామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్, ఆయన అనుచరులకు ఒక ఏటీఎంలా మారిందనేది అక్షరాల సత్యం అని స్పష్టంచేశారు. ఇలా మీరు చేసిన దౌర్భాగ్యపు పనులన్నింటినీ ఒక్కొక్కటి చక్కదిద్దుటుంటే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన మీరు మాపై మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలను ఉసిగొల్పడం సమంజసమా..? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

కాకమ్మ కథలతో పబ్బం గడిపి..
అధికారంలో ఉన్న పదేళ్లు పలు మీడియా సమావేశాలు నిర్వహించి కాకమ్మ కథలు చెప్పిన మీరు, ఇప్పుడు మౌనవ్రతం చేపట్టి ఫామ్‌ హౌస్‌కే ఎందుకు పరిమితమయ్యారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని కేసీఆర్‌ కు మహేశ్‌ గౌడ్‌ సూచించారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి మీ సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుందని హితవు పలికారు. కానీ మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రజారంజక కార్యక్రమాలను విమర్శిస్తూ పోతే ప్రజలు హర్షించరని, మళ్లీ తరిమి కొట్టడం ఖాయమని స్పష్టం చేశారు.

మీ దిగజారుడు తనానికి నిదర్శనం..
తెలంగాణ తల్లి రూపురేఖలపై విమర్శలు చేయడం మీ దిగజారుడు తనానికి నిదర్శనమని పీసీసీ చీఫ్‌ చురకలంటించారు. మూసీ సుందరీకరణపైనా అసత్య ఆరోపణలు చేయడం తగదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారనే వాస్తవాన్ని తెలుసుకోవాలని స్పష్టంచేశారు. ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఇప్పటికైనా అవాకులు చవాకులు చేయడం మాని ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

చెప్పిందొకటి.. చేసింది మరొకటి..
‘గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చెప్పిందొకటి.. చేసింది మరొకటి. అది చేస్తాం.. ఇది చేస్తామంటూ జనానికి అన్యాయం చేశారు. అభివృద్ధి పేరుతో ఊర్లకు ఊర్లు ఖాళీ చేయించి జనాన్ని నట్టేట ముంచారు. పేరు గొప్ప, ఊరు దిబ్బలా మార్చింది నిజం కాదా? అభివృద్ధి పేరుతో సామాన్యులకు కుచ్చుటోపి పెట్టంది నాటి ప్రభుత్వం. ఇంతిస్తాం.. అంతచేస్తాం అంటూ గొప్పలు చెప్పి రైతులను నిండా ముంచారు. న్యాయం కోసం నాయకుల చుట్టు చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకున్న పాపాన పోలేదు. నాడు అరిగోస పడ్డ బాధితులకు నేడు చేయూతనిస్తుంది హస్తం సర్కార్‌’ అని మహేశ్‌కుమార్‌ లేఖలో పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10