నిన్నొక్కరోజే రూ.313 కోట్ల మద్యం తాగేశారు
‘సలార్’ రికార్డులు బద్దలు కొట్టిన మందుబాబులు
ప్రభుత్వ ఖాజానాపై కాసుల వర్షం
పండగ ఏదైనా తెలంగాణలో బీర్లు పొంగాల్సిందే. ఇక న్యూఇయర్ అయితే అమ్మకాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ దుమ్మురేపింది. న్యూఇయర్ తెచ్చిన కిక్కు అంతా ఇంతాకాదు.. నిన్నొక్కరోజే రూ.313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. దీనిని బట్టి చూస్తే మందుబాబులు ఏ రేంజ్‌లో మునిగితేలారో తెలుస్తోంది. ‘సలార్’ రికార్డులు సైతం మందుబాబులు బద్దలు కొట్టడం గమనార్హం.
న్యూఇయర్ సందర్భంగా మందుబాబులు తెగ తాగేశారు. డిసెంబర్ 31 మద్యం ఏరులైపారింది. ప్రభుత్వ ఖాజానాపై కాసుల వర్షం కురిపించారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగాయి.. ఒక్క రోజులోనే కోట్ల ఆదాయం వచ్చింది. ఎంతలా అంటే..! ఏకంగా ప్రభాస్ ‘సలార్’ మూవీ రికార్డులను దాటేశాయి. న్యూ ఇయర్ కావడంతో మద్యం దుకాణాల దగ్గర భారీగా క్యూ కట్టారు మందుబాబులు. దీంతో మద్యం దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది.
మూడు రోజుల్లో రూ.625 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి..న్యూ ఇయర్ సందర్భంగా ఒక్కరోజే రూ.313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. ఒక్కరోజులో మద్యం విక్రయాలు జరిగిన తీరు ఇప్పుడు అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగాయి. ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.147 కోట్ల లిక్కర్ సేల్ జరిగింది. సాధారణ రోజుల్లో రూ.75 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరుగుతుండగా.. డిసెంబర్ 31 సందర్భంగా లిక్కర్ సేల్ ఓ రేంజ్‌లో పెరిగింది.









