దేశంలో మొదటి లిక్కర్ అలర్జీ కేసు నమోదైంది. హైదరాబాద్ అశ్విని హాస్పిటల్ లో మద్యం అలర్జీ కేసు నిర్ధారణ అయింది. ఇప్పటి దాకా ప్రపంచంలోని 100 కుపైగా ఇలాంటి కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ దగ్గర ఆగ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చిన యువకుడికి ఆల్కహాల్ ఎలర్జీ అయినట్లు గుర్తించారు. కొన్ని వేల మందికి ఇలాంటి పరిస్థితి ఉండవచ్చని, నిర్ధారణ కాని పరిస్థితి ఉందని అలర్జీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ వెల్లడించారు.
ఆగ్రా ప్రాంతానికి చెందిన జాన్ (36) తన మిత్రులతో కలిసి పార్టీలో పాల్గొన్నాడని, కబుర్ల అనంతరం అందరూ కలిసి మద్యాన్ని సేవించారని డాక్టర్ వ్యాకరణం తెలిపారు. అందరితో పాటు జాన్ మద్యం తాగాడని, సరిగ్గా 15 నిమిషాల తర్వాత ముఖమంతా ఎర్రబడి వేడిగా మారడం, చర్మంపై దురదలు రావడం, ఛాతీ బరువుగా అనిపించడంతో పాటు ఆయాసం వంటి లక్షణాలు కనిపించాయని బాధితుడు పేర్కొన్నట్లు డాక్టర్ వ్యాకరణం తెలిపారు.









