AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జిల్లా పార్టీ అధ్యక్షులకు వైసీపీ అధినేత జగన్ మోటివేషన్..!

జిల్లా పార్టీ అధ్యక్షులతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఇకపై నిత్యం ప్రజల్లో ఉండాలని ఆయన వారికి సూచించారు. “ఎవరి ఆదేశాలకోసమో మీరు ఎదురు చూడొద్దు, మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ ఛార్జితో కలిసి మొదట కదలాల్సింది జిల్లా అధ్యక్షులే.. రాష్ట్ర కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా లోకల్ గా కార్యక్రమాలు చేయాలి, వాటితో హైలైట్ కావాలి” అని వారికి ఉద్భోదించారు. స్తబ్దుగా ఉన్న జిల్లా పార్టీ శ్రేణుల్లో కదలిక తెచ్చేందుకు జగన్ ఈ పార్టీ మీటింగ్ పెట్టారు. అదే సమయంలో జిల్లాలో పార్టీకి మీరే ఓనర్ అంటూ వారికి కాస్త ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు మాట్లాడారు. మరి క్షేత్ర స్థాయిలో నిజంగానే జిల్లా పార్టీపై అధ్యక్షులకు పెత్తనం ఇస్తారా, లేక పెత్తనం ఇచ్చినట్టే ఇచ్చి.. రాష్ట్ర స్థాయిలో అందర్నీ సమన్వయం చేసుకంటారా.. అనేది ముందు ముందు తేలిపోతుంది.

 

వైసీపీలో స్తబ్దత..

అధికారం కోల్పోయాక వైసీపీ అధినేత జగన్ తోపాటు ఆ పార్టీ నేతలు కూడా కాస్త డల్ అయ్యారు. అందులోనూ ప్రతిపక్ష హోదా కూడా లేని ఘోర ఓటమి కావడంతో జనంలోకి వెళ్లేందుకు నేతలు తటపటాయిస్తున్నారు. అధినేత జగన్ బెంగళూరులో ఎక్కువ టైమ్ ఉంటున్నారు. రాష్ట్ర స్థాయి నేతల్లో కూడా పెద్దగా హుషారు లేదు. కొడాలి నాని వంటి వారికి ఆరోగ్య సమస్యలు, కాకాణి గోవర్దన్ రెడ్డి వంటి వారికి కేసుల సమస్యలు. ఇలా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్లకు ఉన్నాయి. దీంతో జిల్లాల్లో పార్టీ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది. దీంతో జగన్ క్షేత్ర స్థాయి నుంచి పార్టీలో కదలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే జిల్లా పార్టీ నేతలతో మీటింగ్ పెట్టారు. వారికి కాస్త మోటివేషన్ ఇచ్చారు. పార్టీని ఇక మీరే మోయాలంటూ ఉత్సాహపరిచారు.

 

గతంలో అలా..

గతంలో వైసీపీ ఏ కార్యక్రమం చేపట్టినా సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు ఇవ్వాల్సిందే. ఇప్పటికీ ఆ పరిస్థితిలో మార్పు లేదనుకోండి. పార్టీ నిర్ణయాన్ని జిల్లా నేతలు యథావిధిగా అమలు చేయాలి. రాష్ట్ర స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే జిల్లాల్లో కార్యక్రమాలు ఉండవు. ఇప్పుడు అధికారం లేకపోవడంతో జిల్లా నేతలు కూడా ఆర్థిక కష్టాలకు జడిసి సైలెంట్ గా ఉంటున్నారు.

 

ఇకపై ఇలా..

 

ఇకపై జిల్లా పార్టీ అధ్యక్షులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్టు చెప్పారు జగన్. అంటే ఒకరకంగా జిల్లా అధ్యక్షులు చొరవ తీసుకుని జనంలోకి వెళ్లాలని, ఏ కార్యక్రమం చేయాలన్నా స్పూన్ ఫీడింగ్ ఉండదని తేల్చి చెప్పారు. అంటే జగన్ పార్టీ వ్యవహారాల్లో మార్పు కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది.

 

రెడ్ బుక్ కలవరింత..

ఇక వైసీపీ మీటింగ్ లో మరోసారి రెడ్ బుక్ ని కలవరించారు జగన్. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని, అంతులేని అవినీతి జరుగుతోందని.. వీటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు అండగా ఉండేలా కార్యక్రమాలు చేయాలని, ఆ కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి దృష్టిని ఆకర్షిస్తాయని, వాటి ద్వారానే నేతల పనితీరు బయటపడుతుందన్నారు. మే నెలాఖరులోపు పార్టీ మండల కమిటీలు ఏర్పాటు చేయాలని, జులై చివరి నాటికి గ్రామస్థాయి, మున్సిపాల్టీల్లో డివిజన్‌ కమిటీలు పూర్తి చేయాలని, అక్టోబరు చివరి నాటికి బూత్‌ కమిటీలు ఏర్పాటు కావాలన్నారు జగన్.

 

క్రికెట్ లెక్కలు..

పార్టీ వ్యవహారాలను క్రికెట్ మ్యాచ్ తో పోల్చి చెప్పారు జగన్. భారీ లక్ష్యం ఉన్నప్పుడు బ్యాట్స్‌ మెన్‌ ప్రతిభ బయట పడుతుందని, అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయట పడుతుందని పోలిక చెప్పారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే బ్యాట్స్‌మెన్‌ ని ప్రజలు ఇష్ట పడతారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనుల వల్ల మనం ఎలివేట్‌ అవుతామని అన్నారు. అందరూ ధోనీల్లాగా తయారు కావాలన్నారు. ప్రజా వ్యతిరేక అంశాల మీద గట్టిగా పోరాటం చేయాలని, లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోతామని కూడా అన్నారు జగన్.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10