(అమ్మన్యూస్, ముంబై):
బాలీవుడ్ సీనియర్ నటుడు, శత్రుఘ్న సిన్హా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతోపాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ అంబానీ హాస్పిటల్‌లో చేర్పించినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఇంట్లో టీవీ చూస్తూ తూలిపోయారని, ఆ తర్వాత తీవ్రమైన జ్వరం, పక్కటెముకల్లో నొప్పులు తీవ్రం కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.
శత్రుఘ్న సిన్హా ఇంట్లోని తనకు ఇష్టమైన సోఫాలో కూర్చుని టీవీ చూస్తుండగా.. ఒక్కసారిగా తూలి ముందుకు పడబోయారని, వెంటనే సోనాక్షి ఆయన్ను కిందపడకుండా పట్టుకున్నారని ఆయనకు అత్యంత సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. అది జరిగిన రోజంతా ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారని, ఆ తర్వాత జ్వరం, పక్కటెముకల్లో నొప్పులు రావడంతో డాక్టర్లు హాస్పిటల్‌కి తరలించాలని సూచించడంతో హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు. రెగ్యులర్ టెస్ట్‌లు చేసి త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పినట్లు కుటుంబ సన్నిహితులు మీడియాకు వెల్లడించారు.
కొంతకాలంగా ఆయన క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభఎన్నికల్లో టీఎంసీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. కొద్ది రోజులుగా ఎలక్షన్లు, సమావేశాల్లో బిజీగా, రెస్ట్ లేకుండా గడిపిన ఆయన కూతురు, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి పనులతోనూ బిజీ అయ్యారు. సోనాక్షి తన బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ని వివాహం చేసుకున్నారు. రెస్ట్ లేకుండా గడపడంతో కాస్త అస్వస్థతకు లోనయ్యారని చెబుతున్నారు. కొత్త దంపతులు సోనాక్షి సిన్హా, ఇక్బాల్ శత్రఘ్నను పరామర్శించారు.