ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ద్వారకలో అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ ‘సుదర్శన సేతు’ ను ప్రారంభించారు. అదేవిధంగా ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. అంతేగాక నీట మునిగిన పౌరాణిక ప్రాశస్త్య నగరం ద్వారకను సందర్శించారు. ఆక్సిజన్ మాస్కు పెట్టుకుని సముద్రం లోపలికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
అగాధ జలాల్లో మునిగి ఉన్న ద్వారకా నగరిలో ప్రార్థనలు జరిపేందుకు వెళ్లడం ఒక దివ్యమైన అనుభూతిని కలిగించిందని ప్రధాని చెప్పారు. ప్రాచీన కాలం నాటి ఆధ్యాత్మిక వైభవానికి, కాలాతీత భక్తి భావానికి తాను అనుసంధానమయ్యానన్న భావన కలిగిందని తెలిపారు. భగవాన్ శ్రీకృష్ణుడి దీవెనలు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ (X) లో ఫొటోలను షేర్ చేశారు.