ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. హస్తినలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షాతో సమావేశం ముగిసిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక, ఢిల్లీ రావడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు.
బుధవారం అమిత్ షాను మర్యాదపూర్వకంగానే కలిశానని తెలిపారు. గతంలో ఎన్నో పర్యాయాలు ఢిల్లీ వచ్చానని, అయితే ఈసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో వచ్చానని, దాంతో తనపై మరింత బాధ్యత ఉందని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఢిల్లీలో ఇంకెవరినీ కలవబోవడంలేదని పవన్ స్పష్టం చేశారు.
కాగా, ఈ పర్యటన పట్ల పవన్ ఎక్స్ లోనూ స్పందించారు. “ఏపీ ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం మీరు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు అమిత్ షా గారూ” అంటూ పవన్ ట్వీట్ చేశారు.