(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
భారత క్రికెట్ జట్టుకు లోక్‌సభ అభినందనలు తెలిపింది. సమావేశాలు ఐదోరోజు ప్రారంభమయ్యాయి. గత వారం వాయిదా పడిన పార్లమెంట్ సమావేశాలు తిరిగి ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే టీ 20 ప్రపంచకప్‌లో గెలుపొందిన టీమ్ ఇండియా జట్టుకు స్పీకర్ ఓం బిర్లా , ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. కెప్టెన్ రోహిత్‌శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్‌కోహ్లీ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా టీమ్ఇండియా జట్టు మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.
17 ఏళ్ల (2007) తర్వాత టీ20 వరల్డ్ కప్‌ను భారత్ ముద్దాడింది. గత రెండు ప్రపంచకప్‌లలో తమను దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ను ఇంటికి పంపిన రోహిత్ సేన.. వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సమష్టి ఆటతీరుతో సఫారీలను మట్టికరిపించింది. చివరి ఓవర్ వరకూ నరాలుతెగే ఉత్కంఠతో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో సఫారీలను మట్టికరిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పొట్టి ఫార్మాట్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంతవరకు ఇదే అత్యధిక స్కోరు. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక పురుషుల క్రికెట్లో భారత్ ఐసీసీ కప్‌ను అందుకోవడం ఇది నాలుగోసారి. వన్డే క్రికెట్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత్, పొట్టి ఫార్మాట్లో కూడా దానిని సమం చేసింది.