ప్రాజెక్టు ప్రాంతం డిజాస్టర్‌కు అనుకూలమే..
ఈ విషయం అప్పట్లోనే కేంద్రం సైతం వెల్లడించింది
సీనియర్ సైంటిస్ట్ బీవీ సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం వచ్చిన భూ ప్రకంపనలపై సీనియర్ సైంటిస్ట్ బీవీ సుబ్బారావు కీలక విషయాలు వెల్లడించారు. భూకంపాలకు వివిధ కారణాలు ఉంటాయని.. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఓ కారణమై ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ప్రాంతం డిజాస్టర్‌కు అనుకూలమని, అక్కడ నీరు నిల్వ ఉండటం ద్వారా ఒత్తిడి ఏర్పడి భూ ప్రకంపనలు వచ్చి ఉంటాయని చెప్పారు.
ప్రాజెక్టులో నీటి నిలువ కారణరంగా..
కాళేశ్వరం ప్రాజెక్టులో వాటర్ నిలువ చేయటం వల్ల ఒత్తడి పెరిగి ఇటువంటివి జరుగుతాయని సీనియర్ భూగర్భ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు వెల్లడించారు. డిజాస్టర్‌కు అనుకూలంగా ఉండే ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టకూడదని.. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ప్రాంతం మెుత్తం డిజాస్టర్‌కు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్రం సైతం వెల్లడించిందని చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూమిలో నీరు బాగా పెరిగిందన్నారు. ఎప్పుడైతే ఇలా నీరు పెరుగుతుందో.. భూమిలో ఫలకాల కదలికలు తేలిక అవుతాయని అన్నారు. వీటి ద్వారా భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.
40 కిలోమీటర్ల లోతులో..
తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం సంభవించిన భూ ప్రకంపనలు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేశాయి. ఉదయం 7.25 గంటల ప్రాంతంలో ఓ రెండు నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్ నగరంతో పాటుగా.. తూర్పు తెలంగాణలోని చాలా జిల్లాల్లో భూమి కంపించింది. ఏపీలోని కొన్ని జిల్లాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ములుగు జిల్లా మేడారనికి దగ్గర్లోని ఐలాపూర్‌కు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా ఉంది. భూమికి 40 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు మెుదలయ్యాయని సైంటిస్టులు వెల్లడించారు.
టోర్నడో వచ్చిన ప్రాంతంలోనే భూప్రకంపనలు
భూకంపకేంద్రంగా చెబుతున్న ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో ఈ ఏడాది ఆగస్టు 31న టోర్నడో తరహా గాలి దుమారం చెలరేగి అరణ్యంలో సుమారు 60 వేల చెట్లు కూలిపోయాయి. ఇదే ప్రాంతం కేంద్రంగా ఇప్పుడు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడికి సమీపంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్‌ను నిర్మించారు. సైంటిస్టు సుబ్బారావు వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడివన్నీ చర్చనీయాంశంగా మారాయి.
రకరకాల కారణాలు..
ఈ భూ ప్రకంపనలు రావటానికి సెంటిస్టులు రకరకాల కారణాలు చెబుతున్నారు. ములుగు ప్రాంతంలో.. సింగరేణి గనుల తవ్వకం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి భూమిలో మెత్తదనం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అందువల్ల భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు భూమిలో ఏర్పడ్డాయని చెబుతున్నారు. దాంతో పాటుగా ఆ ఏరియా గోదావరి నది పరివాహాక ప్రాంతమని.. నీరు పారే చోట భూమిలో మెుత్తదనం ఏర్పడి ఉంటుందని పేర్కొంటున్నారు. గోదావరి జలాల వల్ల భూమిలో గట్టిదనం తగ్గిపోయి.. మెత్తగా మారడం వల్ల భూమి కదలికలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. అందుకే ఈ భూకంప ప్రకంపనలు ఇన్ని చోట్లకు రాగలిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.