AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైడ్రా.. ఇక దూకుడే.. ‘చట్టబద్దత’తో మరింత బలం..

మరిన్ని అధికారాలతో ముందుకు
అక్రమార్కుల్లో గుబులు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
హైడ్రా.. హైదరాబాద్‌ డిజాస్టర్, రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీకి మరింత బలం చేకూరింది. ఇక, హైడ్రా దూకుడు మరింత పెరగనుంది. ఎవరూ ప్రశ్నించలేని తరహాలో ఈ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం తీర్చి దిద్దింది. ఇప్పటి వరకు ‘మీ చట్టబద్ధత ఏంటి?’ అని పలు వర్గాల నుంచి హైడ్రాకు ప్రశ్నలు ఉత్పన్నమైన విషయం తెలిసిందే. ఇలాంటి కీలక సమయంలో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ.. నిర్ణయం తీసుకుంది.

ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం..
చట్టం చేసేందుకు అసెంబ్లీ సమావేశాలు అందుబాటులో లేకపోవడంతో హైడ్రాపై ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చింది. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌ నుంచి ఓ గెజిట్‌ విడుదల అయింది. దీని ప్రకారం.. హైడ్రాకు మరింత అధికారం కల్పించడంతోపాటు.. ఈ సంస్థ చేపట్టే కార్యకలాపాలకు చట్ట బద్ధతను కూడా కల్పించారు. ఇక, హైడ్రాకు పూర్తిస్థాయి చట్టబద్ధను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కల్పించనున్నారు.

జూన్‌ 19న ఏర్పాటు..
ఈ ఏడాది జూన్‌ 19న హైడ్రాను ఏర్పాటు చేస్తూ.. సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనికి కమిషనర్‌గా సీనియర్‌ అధికారి రంగనాథ్‌ను నియమించారు. ఆ తర్వాత నుంచి ఈ సంస్థ పనిచేయడం ప్రారంభించింది. హైదరాబాద్‌ పరిధిలోని చెరువులు, కుంటులు, నాలాలను పరిరక్షించడం.. మూసీ నది వెంబడి ఉన్న ఆక్రమణలను.. అవి ఎంతటి పెద్దవారివైనా కూడా తొలగించడం అనే కీలక విధులను ఈ సంస్థకు అప్పగించారు. అయితే.. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ – కన్వెన్షన్‌ను కూల్చివేసిన తర్వాత.. హైడ్రా పేరు మార్మోగిపోయింది.

హైడ్రా విధులు.. పరిధి

1) చెరువులు, నాలాలు, కుంటలు, సరస్సులను పరిరక్షించడం.
2) భారీ వరదలు, వర్షాలు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడం.

3) ట్రాఫిక్‌ పోలీసులతో సమన్వయం చేసుకుని కీలక సమయాల్లో పనిచేయడం.
4) అగ్నిమాపకశాఖ సేవలకు ఎన్‌వోసీ జారీచేయడం.
5) రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఓఆర్‌ఆర్‌ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10