అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లోని పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరోవైపు సంచలన నిర్ణయాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే.. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు రుణమాఫీ పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లాంటి పథకాలను త్వరలోనే అమలు చేసేందుకు సిద్ధమైంది. అయితే.. ఈ క్రమంలోనే మరో కొత్త పథకాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ఈ మేరకు.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన చేశారు.
మంగళవారం (అక్టోబర్ 08న) రోజున ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. గత పదేళ్లుగా విద్యుత్ శాఖలో ప్రమోషన్లు లేక అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే పెడింగ్‌లో ఉన్న ప్రమోషన్లు ఇచ్చామని భట్టి తెలిపారు. విద్యుత్ శాఖలోని ఉద్యోగులపై భారం తగ్గించే దిశగా.. ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు కూడా ఇవ్వనున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
ఈ క్రమంలోనే.. మరో కీలక ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందన శాఖలో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువుల విషయంలో కొత్త పథకం తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని భట్టి ప్రకటించారు. విద్యుత్ సంబంధిత సమాచారం.. ఫిర్యాదుల కోసం1912 హెల్ప్ లైన్ నెంబర్‌ను అధికారులు ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.