(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నేత మల్లారెడ్డి భేటీ కావడం సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. నిన్న మొన్నటి వరకూ ఉప్పు నిప్పు గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో ఈ రోజు మాజీమంత్రి మల్లారెడ్డి సమావేశం అయ్యారు. తన మనవరాలి పెళ్లి ఉందని చెప్పి వివాహ పత్రిక ఇచ్చేందుకు సీఎం ఇంటికి వచ్చినట్లు స్పష్టం చేశారు. అంతకు మించి ఏమీ లేదని అన్నారు.
ఇప్పటికే ఈ వివాహపత్రికతో చంద్రబాబును కలిసినట్లు మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో తీగల కృష్ణారెడ్డితో పాటు మల్లారెడ్డి, అతని అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి చంద్రబాబుని కలిశారని.. త్వరలో వీరు టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం మొదలైంది. అయితే… కేవలం పెళ్లికి పిలవడానికే వెళ్లినట్లు మల్లా రెడ్డి స్పష్టం చేస్తున్నారు. మరోపక్క హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారిన హైడ్రా దాడుల నుంచి తమను చంద్రబాబు ఒక్కరే కాపాడగలరని మల్లారెడ్డి – కో భావిస్తున్నారనే చర్చ జరుగుతుంది. ఈ సమయంలో… తమ విద్యా సంస్థలపై హైడ్రా దాడులు జరిగే అవకాశం ఉందనే విషయంపైనా చర్చించి.. చంద్రబాబుని మల్లారెడ్డి రిక్వస్ట్ చేశారనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బలంగా నడుస్తుంది! ఏది ఏమైనా… కారణం మరేదైనా… అటు చంద్రబాబుని, ఇటు రేవంత్ రెడ్డిని బీఆరెస్స్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కలవడం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.. పలు ఊహాగాణాలను, మరిన్ని రాజకీయ చర్చలకు వేదికైంది!
ప్రముఖులకు ఆహ్వానం…
కొన్ని రోజుల నుంచి వివిధ పార్టీల్లోని ప్రముఖులను కలిసి తన మనవరాలి పెళ్లికి ఆహ్వానిస్తున్నారు మల్లారెడ్డి. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును సైతం కలిశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ తదితరులను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ రోజు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ను సైతం కలిసి తన మనవరాలి వివాహానికి ఆహ్వానించారు.