గవర్నర్ తమిళిసై పై నిప్పులు చెరిగిన మంత్రి
బిల్లులను పెండింగ్ లో ఉంచే అధికారం గవర్నర్ కు ఎక్కడిది:మంత్రి
గవర్నర్ తమిళిసై పై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె గవర్నరా..? లేక బీజేపీ నాయకురాలా అంటూ నిలదీశారు.సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. బిల్లులను పెండింగ్ లో ఉంచడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులను పెండింగ్ లో ఉంచే అధికారం గవర్నర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు.ప్రజాస్వామిక ప్రభుత్వ చట్టాలను నిలువరించే హక్కు ఎవరిచ్చారని అడిగారు.
రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ మూలసూత్రాలను కాదని చట్టాలు చేయలేదని.. ఒకవేళ రాజ్యాంగ నిబంధనలు అధిగమించనట్లయితే.. దాన్ని అడ్డుకునే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉందని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థకు కేంద్రం తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. బీజేపీయేతర రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగానే బిల్లులను పెండింగ్ లో ఉంచుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమాలకు మోకాలోడ్డే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇదంతా గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టి కేంద్రం ఆడుతున్న నాటకమని మండిపడ్డారు.