ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు పంపిన అంశంపై స్పందిస్తూ మంత్రి కేటీఆర్ కేంద్రంపై ఆరోపణలు చేశారు. కవితకు పంపినవి ఈడీ సమన్లు కావన్న కేటీఆర్.. అవి మోదీ సమన్లు అన్నారు. బీఆర్‌ఎస్ నేతలైన మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్, జగదీశ్ రెడ్డి, లోక్‌సభలో బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో బీఆర్ఎస్ నేత రవిచంద్ర, పార్థసారథి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎల్ రమణ, రోహిత్ రెడ్డి మొదలైన వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరిపించారన్న కేటీఆర్.. ఇప్పుడు కవితకు సమన్లు పంపడం వెనక కేంద్రమే ఉంది అన్నారు.
మోసాలు, గారడీలు చేస్తున్నారన్న కేటీఆర్ … మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక… 5,426 కేసులు పెట్టించి… 23 కేసుల్లో మాత్రమే దోషులుగా తేల్చారని ఆరోపించారు. ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకే కేంద్రం ఇలా చేస్తోందని మండిపడ్డారు. దేశంలో నీతిలేని పాలన ఉండగా.. నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలు ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. ప్రతిపక్షాలపై కేసుల దాడి చేస్తూ.. ప్రజలపై ధరల దాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
పారిశ్రామిక వేత్త గౌతం అదానీ ఎవరి బినామీ అని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్… ప్రధాని మోదీ బినామీ అని అన్నారు. LIC, SBIకి చెందిన రూ.13 లక్షల కోట్లు మాయమైనా.. దానిపై ప్రధాని గానీ, కేంద్ర ఆర్థిక మంత్రి గానీ స్పందించట్లేదని కేటీఆర్ ఆరోపించారు. గౌతం అదానీకి 6 ఎయిర్ పోర్టులు ఇవ్వడం తప్పన్న కేటీఆర్… ముంద్రా పోర్టులో 3వేల కేజీల హెరాయిన్…. 21 వేల కోట్ల విలువైనది దొరికినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు కేటీఆర్.