ఎన్నికల్లో గెలవలేక దర్యాప్తు సంస్థలను ఉపయోగించి భయపెడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ,సెబీ, ఎల్ఐసీ డైరెక్టర్ల పదవీ కాలం ఇష్టమొచ్చినట్లు పొడిగిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. దర్యాప్తు సంస్థలు మహిళల ఇంటికి వచ్చి విచారించాలని, కానీ అధికారులు తనను ఈడీ కార్యాలయానికి పిలిచారన్నారు. దేశానికి ఒక ఇంజిన్ మోదీ అయితే.. మరో ఇంజన్ అదానీ అని ఎద్దేవ చేశారు. కొందరి ప్రయోజనాల కోసమే మోదీ పనిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలపై పెరుగుతున్న భారాలు మోదీకి బుద్ధి చెప్తాయని అన్నారు. మహిళా రిజర్వేషన్ పై మోదీ సర్కారు మాట తప్పిందని ఆమె ఫైర్ అయ్యారు. మహిళా బిల్లు కోసం 27 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని అన్నారు. 2014-2018లో బిల్లుపై హామీ ఇచ్చారని, ఇంతవరకు ఆ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందలేదని తెలిపారు. మహిళా బిల్లును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో దీక్ష నిర్వహిస్తామని కవిత స్పష్టం చేశారు.