AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బండి సంజయ్ అరెస్ట్‌పై హైటెన్షన్..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌తో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేతలు దీనిని తీవ్రంగా ఖండిస్తుండగా.. కార్యకర్తలు అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలు చేపడుతున్నారు. కరీంనగర్‌లోని తన ఇంటిలో బండి సంజయ్ ఉన్న సమయంలో పోలీసులు ప్రవేశించి అర్థరాత్రి ఆయనను బలవంతంగా తీసుకెళ్లారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పొలీస్ స్టేషన్‌కు ఆయనను తీసుకెళ్లారు. దీంతో పీఎస్‌కు భారీగా బీజేపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో పీఎస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా పీఎస్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో స్టేషన్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయగా.. కాషాయ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

పోలీస్ స్టేషన్ ఎదుట కర్రలు వేసి బీజేపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. పోలీసులు, బీజేపీ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకోగా.. పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, వెంటనే విడుదల చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారని విమర్శిస్తున్నారు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయవచ్చని పోలీసులు వాదిస్తున్నారు.

బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌కు అడ్వకేట్లు చేరుకున్నారు. కానీ అడ్వకేట్లను లోనికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ‘బండి సంజయ్‌ను దేనికి అరెస్టు చేశారు.. కారణం చెప్పండి’ అంటూ పోలీసులను అడ్వకేట్లు అడగ్గా.. కోర్టులోనే చూసుకోండి అంటూ పోలీసులు సమాధానం ఇచ్చారు. సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ అత్తమ్మ చనిపోయి రేపటికి తొమ్మది రోజులు అవుతుంది. 9వ రోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్ వచ్చిన బండి సంజయ్‌ను అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజీ విషయంలో ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టాలని బండి సంజయ్ నిర్ణయించుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అర్ధరాత్రి బండి సంజయ్ ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

బండి సంజయ్‌కు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి అధికారికంగా పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. కాసేపట్లో నల్లగొండకు ఆయనను తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ కాన్వాయ్ మధ్య బండి సంజయ్‌ను తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఎక్కడకు తరలిస్తారనే దానిపై మాత్రం పోలీసులు ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10