బొమ్మలరామారం పీఎస్ దగ్గర తీవ్ర ఉద్రిక్త
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసేందుకు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రఘునందర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు రఘునందన్ ప్రయత్నాలు చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రఘునందన్ వాగ్వాదానికి దిగారు. దీంతో బొమ్మలరామారం పీఎస్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళుతుండగా మహిళా కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో వారిని తప్పించి రఘునందన్‌ను పోలీసులు తీసుకెళ్లారు. బండి అరెస్ట్‌తో టెన్షన్ వాతావరణం నెలకొన్న క్రమంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఏర్పడే అవకాశం ఉండటంతో రఘునందన్ రావును అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు బీజేపీ పిలుపునిచ్చింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పోలీసుల తీరును ఖండించారు. ఒక ఎంపీకి కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని, కేసీఆర్ చెప్పినట్టు పోలీసులు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తప్పుదోవ పట్టించడానికి బండిని అరెస్ట్ చేశారని విమర్శించారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఈటల రాజేందర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అటు బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ్ బండి అరెస్ట్‌ను ఖండించారు. బీఆర్ఎస్కు కాలం చెల్లిందని, త్వరలోనే ఆ పార్టీకి బొంద పెడతారని విమర్శించారు. బండి అరెస్ట్ హేయమైన చర్యగా ఆమె అభిర్ణించారు. బండిని వెంటనే విడుదల చేయాలని కోరారు.