తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మెుదలైంది. ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉండటంతో అన్ని పార్టీల నేతలు యాక్టివ్ అయ్యారు. ప్రజలతో మమేకమవుతూ.. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. వినూత్న కార్యక్రమాలతో ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాము చేసిన అభివృద్ధిని, చేయబోయే పనులను ప్రజలకు వివరిస్తూ ఓటర్లకు దగ్గరయ్యేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.
అధికార పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నియోజవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాము రాజకీయాల్లో ఉన్న ఓట్ల బిచ్చగాళ్లమని.., ఒక్కో ఓటును ఎలా తెచ్చుకోవాలా అని చూస్తామన్నారు. ఏ ఓటును పోగొట్టుకోలేమని వ్యాఖ్యానించారు. తన నోటి నుంచి ఏదైనా తప్పుడు మాట వస్తే ఓట్లు పోతాయంటూ చమత్కరించారు.
కాలేజీ గ్రౌండ్‌లో ట్రాక్ విషయంలో మీరందరూ నన్ను పొగుడుతారు.. కానీ నేను మిమ్మల్ని పొగడాలి. ట్రాక్ కావాలనే ఆలోచన నాకు మెుదట్నుంచి ఉంది. అక్కడ పాత కాలేజీలో చదువుకున్నవాడిగా ట్రాక్ కావాలనే ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు నేను మాట్లాడి.., నా నోట్లో నుంచి కొంచెం తక్కువైతే 300 ఓట్లు పోతయ్. అవసరమైతే 500 పోతయ్. మంచి మాట్లాడితే ఓట్లు పోతయ్. రాజకీయాల్లోకి వచ్చినం. ఓట్ల బిచ్చగాళ్లం. ఒక్కొక ఓటు ఎట్ల తెచ్చుకోవాలో చూడాలి. కానీ పొగొట్టుకోలేం. ఆ కాలేజీ గ్రౌండ్ అప్పట్లో బ్రహ్మండంగా ఉండేది. ఇయ్యాల దగ్గరికి అయింది. (ఆక్రమణలు ఎక్కువయ్యాయి) బాగా బాధనిపిస్తది. కానీ ఏం చేయలేం. మంచి మాట్లాడితే ఓట్లు పోతయ్. అంటూ సంజయ్ వ్యాఖ్యనించారు. సంజయ్ కామెంట్లపై నియోవజర్గంలో జోరుగా చర్చ జరగుతోంది. ఎమ్మెల్యే అలా మాట్లాడారేంటి అని ప్రజలు చర్చించుకుంటున్నారు.