టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరొకరిని సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటకు చెందిన ప్రశాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ చేసినవారి నుంచి పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసినట్లు సిట్ నిర్థారించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజశేఖర్, రేణుకతో ప్రశాంత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అవ్వగా.. తాజాగా అరెస్ట్‌తో ఆ సంఖ్య 13కు చేరుకుంది. లీక్ చేసినవారితో పాటు వారికి డబ్బులు చెల్లించి పేపర్ తీసుకున్న అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తోన్నారు. ప్రశ్నాపత్రాల కోసం దాదాపు రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు చెల్లించినట్లు సిట్ గుర్తించింది. డబ్బులు చెల్లించినవారికి పేపర్ ప్రింట్ కాపీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నిందితుల ఇళ్లల్లో సిట్ సోదాలు నిర్వహించి పెన్‌డ్రైవ్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. పెన్‌డ్రైవ్‌లో ప్రశ్నాపత్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.