ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు దుమారం రేపుతోంది. రాజకీయాల్లో ఈ కేసు చిచ్చు రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల యుద్దానికి దారి తీస్తోంది. ఈ క్రమంలో కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను సిట్ పోలసీులు పొందుపర్చారు. ఇప్పటివరకు పేపర్ లీక్ కేసులో 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇందులో తొమ్మిదిమంది నిందితులతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ ముగ్గురిలో ఇద్దరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం నలుగురు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు ఈ రిపోర్టులో ఉంది.
టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల విషయానికొస్తే.. ఏ1గా టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్ ఉండగా.. ఏ2గా నెట్‌వర్క్ అడ్మిన్ రాజశేఖర్ ఉన్నారు. ఇక షమీమ్ ఏ10గా, డాటా ఎంట్రీ ఆపరేటర్ రాజశేఖర్ ఏ12గా కేసులో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. అలాగే ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు 19 మంది సాక్షులను విచారించినట్లు సిట్ పోలీసులు చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మి ప్రధాన సాక్షిగా ఉండగా.. టీఎస్‌పీఎస్సీ, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ ఉద్యోగులు కూడా సాక్షులుగా ఉన్నట్లు స్పష్టం చేశారు.