కేసీఆర్, కేటీఆర్‌కు రేవంత్ సవాల్
ఓయూ జేఏసీ (OU JAC) ఆధ్వర్యంలో జరుగనున్న నిరుద్యోగ దీక్షకు వెళ్లనీయకుండా పోలీసులు గృహనిర్బంధం చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘పోలీసులను పంపి, నన్ను గృహనిర్భందం చేయడం కాదు… కేసీఆర్ – కేటీఆర్‌లకు దమ్ముంటే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల కుంభకోణంపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలో చర్చకు రావాలి. మీరు సచ్ఛీలురైతే, స్కాంలో మీ పాత్రలేకపోతే నా సవాల్‌ను స్వీకరించాలి’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
కాగా.. నిరుద్యోగ మహాదీక్షకు రేవంత్ హాజరు కావడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief) ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఓయూ జేఏసీ (OU JAC) నేతృత్వంలో నేడు ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిరుద్యోగ మహా దీక్ష జరగనుంది. దీక్షకు ముఖ్య అతిథిగా హాజరై రేవంత్ సంఘీభావం తెలపనున్నారు. అయితే ఈ దీక్షకు అనుమతి లేదంటూ.. రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీకి (Osmania University) వెళ్ళకుండా అరెస్ట్ చేసేందుకు పోలీస్‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓయూకు వెళ్లి తీరతానని రేవంత్ చెబుతున్నారు. దీక్ష జరిగి తీరుతుందని ఓయూ విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. ఓయూకు వస్తే రేవంత్‌ను అడ్డుకుని తీరుతామని బీఆర్ఎస్వీ హెచ్చరిస్తోంది. అయితే రేవంత్ మహాదీక్షకు హాజరు కానున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ ఇంటికి వెళ్లే దారులన్నీ మూసేశారు. రేవంత్ ఇంటికి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.