ఏపీలో విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేసింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం డబ్బుల్ని బటన్ నొక్కి అకౌంట్‌లలోకి విడుదల చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. జగనన్న విద్యా దీవెన కింద సీఎం జగన్ ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుంచి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం రూ.13,311 కోట్లను ఆర్ధిక సాయం అందించింది జగన్ ప్రభుత్వం. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది జగన్ సర్కార్.
మా ప్రభుత్వం … ప్రజలకు మంచి చేయలేదని నమ్మితే.. ఈ తోడేళ్లంతా పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాయో చెప్పాలంటూ సవాల్ విసిరారు CM జగన్.. సినిమాల్లో హీరోలే నచ్చుతారు కానీ విలన్లు కాదంటూ విపక్షాలపై పంచ్‌లు పేల్చారు వైఎస్ జగన్. ఎవరు ఎన్నికుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే అంటూ ధీమా వ్యక్తం చేశారు. కుటుంబం, రాజకీయ, మనవతా విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని విపక్షాలపై విరుచుకుపడ్డారు. మన ప్రభుత్వంలో డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్.. గత ప్రభుత్వంలో డీపీటీ.. దోచుకో, పంచుకో, తినుకో అని సీఎం జగన్ ఎద్దేవ చేశారు. కొత్తగా 14 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చామని.. 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. 45 నెలల్లో డీబీటీ ద్వారా నేరుగా 1.9లక్షల కోట్లు అందించామన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నామన్నారు.