భారత్తో ఇటీవల పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ కీలక చర్యలు చేపట్టినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని పలు ఉగ్రవాద శిబిరాలను పాకిస్థాన్ సైన్యం ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇటీవల భారత్లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో, భారత్ నుంచి ప్రతీకార చర్యలు ఉండవచ్చనే భయంతోనే పాక్ ఈ చర్యలు తీసుకుంటోందని భావిస్తున్నారు.
నిఘా వర్గాల కథనం ప్రకారం, పీవోకేలోని కెల్, సర్ది, దుధ్నియల్, అత్ముఖం, జురా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుతా, కొట్లి వంటి కీలక ప్రాంతాల్లోని లాంచ్ప్యాడ్ల నుంచి ఉగ్రవాదులను పాక్ సైన్యం హుటాహుటిన తరలిస్తోంది. వీరిని సమీపంలోని ఆర్మీ షెల్టర్లు, సైనిక బంకర్లకు తరలిస్తోంది.
భారత్లోకి చొరబడే ముందు ఉగ్రవాదులకు ఈ లాంచ్ప్యాడ్లే ప్రధాన స్థావరాలుగా పనిచేస్తాయి. ఈ శిబిరాల్లో సుమారు 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారని, వారంతా భారత్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారత భద్రతా సంస్థలు పీవోకేలోని పలు క్రియాశీలక ఉగ్రవాద లాంచ్ప్యాడ్లను గుర్తించాయని, వాటిపై నిఘా పెంచాయని పాకిస్థాన్ భావిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే, ముందు జాగ్రత్త చర్యగా పాక్ సైన్యం ఈ స్థావరాలను ఖాళీ చేయించి, ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల జమ్ముకశ్మీర్లో పర్యాటకులు, భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.