బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంతమంది ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు తమకు తెలిసిందని పేర్కొన్నారు. తమను ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లను బరాబర్ పింకు బుక్కులో రాసుకుంటాం అని ఆమె హెచ్చరించారు.
వారిని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్సీ కవిత
కావాలని బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లకు ఈడుస్తున్నారని అలాంటి వాళ్ళను ఉపేక్షించేది లేదని కవిత తేల్చి చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకుల పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను వేధించే అధికారులను, నాయకులను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
ఎవరికీ భయపడేది లేదు
తాము ఎవరికి భయపడబోమని, మీ తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరి దిగొచ్చినా భయపడబోమని కవిత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, అదేమని ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ నేతలను వేధింపులకు గురిచేస్తుందని కవిత అన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ నైజం అంటూ కవిత విమర్శలు గుప్పించారు.
ప్రజలను మోసం చేస్తున్నారు
ఎన్నికలకు ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు చేసిన గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంచి ఓట్లు అడిగారని, ఇప్పుడు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెట్టిందని ఎంతోమంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.