గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్‌లో ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు, నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. వెంటనే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆయనను తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది?
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కొత్త ట్విస్ట్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. ఉదయం 11 గంటలకు ఆయన్ని గన్నవరం పోలీసుస్టేషన్ తీసుకురానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై ఆ పార్టీ నేతలు దాడి చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ నిందితుడిగా ఉన్నారు.
రెండు రోజుల కిందట ఈ కేసు విచారణ విజయవాడ కోర్టులో జరిగింది. ఎవరైతే ఆఫీసుపై దాడి జరిగినట్టు పేర్కొన్నారో, సత్యవర్థన్ అనే వ్యక్తి తాను ఫిర్యాదు చేయలేదని న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశాడు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. పోలీసులు, టీడీపీ నేతల ఒత్తిడితో తాను ఫిర్యాదు చేశారని అందులో ప్రస్తావించాడు. ఆయన మాటల వీడియోను న్యాయస్థానం రికార్డు చేసింది.
ఈ కేసులో నిందితులంతా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం న్యాయస్థానంలో వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. గురువారం తీర్పు రావాల్సింది. అంతలోనే మాజీ ఎమ్మల్యే వంశీ అరెస్ట్ కావడం అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది? వంశీ మద్దతుదారులు ఆయన్ని బెదిరించి ఈ విధంగా చెప్పించారా? అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
దాడి కేసులో కిడ్నాప్ వ్యవహారం
పిటిషన్ ఉపసంహరించుకున్న సత్యవర్థన్ని వంశీ మనుషులు కిడ్నాప్ చేసి, బలవంతంగా విత్ డ్రా చేశారట. దీనిపై సత్యవర్థన్ మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిటిషన్ వెనక్కి తీసుకోవడం వెనుక వంశీ ప్రధాన కారణమని చెప్పాడు. దీంతో ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు, కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
గతరాత్రి గన్నవరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఇందులోభాగంగానే గురువారం ఉదయం వల్లభనేని వంశీ ఇంటికి వచ్చిన పోలీసులు, నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. దీంతోపాటు మరో కీలకమైన అంశం ఇందులో ఉంది. వైసీపీ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలు జరిగాయి. వంశీ మనుషులు ఈ తవ్వకాలకు భారీ ఎత్తున పాల్పడినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులకు కొంతమంది ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించారు. మట్టి అక్రమ తవ్వకాలు జరిగాయని, వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. దీనిపై రేపో మాపో కేసు నమోదు చేసే అవకాశముందని సమాచారం.
అరెస్ట్ సమయంలో మాట్లాడిన వంశీ, అన్ని కేసులో బెయిల్ ఉందని, ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులను ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల కిందట మీడియాతో మాట్లాడిన వంశీ, ఏదైనా చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రతీ దానికీ ఓ మార్గం ఉంటుందన్నారు. కోర్టు వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు.