బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్నానని.. గంభీరంగా చూస్తున్నానని.. నేను కొడితే మామూలుగా ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుతామన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని..నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చిందని అన్నారు. చెప్పినా ప్రజలు వినలేదని…అత్యాశకు పోయి కాంగ్రెస్ కు ఓటేశారని పేర్కొన్నారు. రైతు బంధుకి రాం రాం, దళితబంధుకి జై భీం చెబుతారని ఆనాడే చెప్పానన్నారు.
తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కు ఓటేశారని అన్నారు. రాబోయే రోజుల్లో విజయం మనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. భూముల ధరలు అమాంతం పడిపోయాయన్నారు. చారిత్రక సందర్భంలో తెలంగాణ జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిలలాడింది, సర్వనాశనం అయిందన్నారు.తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడేనని.. ప్రాణం పోయినా సరే తెగించి కొట్లాడేది మనమే, తెలంగాణకి రక్షణ మనమేనని కేసీఆర్ తెలిపారు. ఏడాది నుంచి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయన్నారు. త్వరలోనే భారీ సభ పెట్టుకుందామని వెల్లడించారు. అన్ని మబుబులు తొలగిపోయి ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయన్నారు. మంచి ఏదో చెడు ఏదో ప్రజలకు తెలుస్తుందన్నారు. మాట్లాడితే ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అని బద్నం చేస్తున్నారనని.. ఫామ్ హౌస్ లో పంటలు తప్ప ఏముంటాయని కేసీఆర్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయని.. సంగమేశ్వరం, బసవేశ్వరం , కాళేశ్వరం అన్ని ఎండబెడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల టెండర్లను కాంగ్రెస్ సర్కారు ఎందుకు ఆపిందని ప్రశ్నించారు. హరీష్ రావుకు చెబుతున్నా.. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలని సూచించారు. ఆ ప్రాజెక్టులకు నీళ్లు రావాలన్నారు. ఆలోచన లేకుండా ఎవడో ఏదో చెబితే ప్రజలు నమ్మి ఓటేస్తే తెలంగాణకు మంచి గుణపాఠం జరిగిందన్నారు. కైలాస ఆటలో పైకి పోయాక పెద్దపాము మింగినట్లుగా తెలంగాణ అయిందన్నారు.కరోనాలో కూడా రైతుబంధు ఇచ్చి రైతుల కోసం మంచి పథకాలు తెస్తే అంత గంగలో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. గురుకుల హాస్టళ్లలో తిండి సరిగా లేక పిల్లలు అస్వస్థతకు గురవ్వడం బాధ కలిగిస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల కోసం పుట్టింది కాదని కేసీఆర్ పేర్కొన్నారు.