మౌనీ అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. నిన్నటి నుంచే ప్రయాగ్‌రాజ్‌కు భారీగా చేరుకున్నారు భక్తులు. ఇప్పటికే 15 కోట్ల మందికిపైగా అమృత స్నానాలు ఆచరించారు. ఇవాళ 10 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టే ఇసకేస్తే రాలనంతగా పోటెత్తారు.
భక్తుల రద్దీ దృష్ట్యా ప్రయాగ్‌రాజ్‌ను నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. సంగమం వెళ్లే స్థానికులు టూ వీలర్లను మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను అమర్చారు. భద్రత బలగాలను భారీగా మోహరించారు. కుంభమేళాకు వెళ్లే జాతీయ రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
యోగి ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసినా.. తెల్లవారుజామున అపశ్రుతి చోటు చేసుకుంది. సంగమం వద్దే పవిత్ర స్నానాలు చేసేందుకు భక్తులు ఆసక్తి చూపడంతో తొక్కిసలాటకు దారితీసింది. భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగిపోయాయి. కొందరు కిందపడిపోయారు. ఘటనలో 20 మందికి పైగా మృతి చెందగా.. 50 మందికి పైగా భక్తులకు గాయాలైనట్లు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు.
ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం దగ్గర పవిత్ర స్నానాలు కొనసాగుతున్నాయి. పరిస్థితి అదుపులో ఉందని అధికారులు ప్రకటించారు. తొక్కిసలాటతో అమృత్ స్నాన్ రద్దు చేసుకుంటూ నిర్ణయం నిర్ణయం తీసుకోగా.. అఖాడా అధిపతులతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మాట్లాడారు. సీఎంతో మాట్లాడిన తర్వాత అఖాడాలు నిర్ణయం మార్చుకున్నారు. అమృత్ స్నాన్ ఆచరించాలని నిర్ణయించారు. మౌని అమావాస్య పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు భారీసంఖ్యలో భక్తులు రాగా.. తొక్కిసలాట జరిగింది.
మహా కుంభమేళాలో తొక్కిసలాట విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వెంటనే యూపీ సీఎం యోగితో ఫోన్‌లో మాట్లాడారు. అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్షించారు. మహా కుంభమేళా ప్రస్తుత పరిస్థితి, సహాయకచర్యలపై ప్రధాని మోదీ సీఎం యోగిని అడిగి తెలుసుకున్నారు. గాయాలైన వారికి వెంటనే చికిత్స అందించాలని.. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని యోగికి సూచించారు. కేంద్రం నుంచి సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు. అధికారుల సూచనలు పాటిస్తూ.. వారికి సహకరించాలని భక్తులకు యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు.
మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు మహాకుంభ్ నిర్వహణను సైన్యానికి అప్పగించాలని..సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ సాయంతో ఆసుపత్రులకు తరలించి, తక్షణ వైద్య ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తొక్కిసలాటపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు .బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను కోరుతున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.
నిన్న రాత్రి నుంచే మౌని అమావాస్య స్నానాలు ఆరంభం అయ్యాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఘటనపై ప్రధాని కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తున్నాయన్న సీఎం… తనకు ప్రధాని నాలుగుసార్లు ఫోన్ చేసినట్లు చెప్పారు. పుణ్యస్నానాల సందర్భంగా ఎటువంటి వదంతులు వ్యాపించినా పట్టించుకోవద్దని కోరారు.