తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు ఏకసభ్య కమిషన్ నియామకం వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా.. ఈ కమిషన్ 60 రోజుల్లోనే నివేదిక సమర్పించేలా చూడాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించిన అంతరం అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు సీఎం ప్రకటించారు.
ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ కులగణనపై.. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం (అక్టోబర్ 09న) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై తమకు అందిన వినతులతో పాటు.. పంజాబ్, తమిళనాడులో వర్గీకరణ అమలవుతున్న తీరు, హర్యానాలో తీసుకుంటున్న చర్యలను.. మంత్రివర్గ ఉప సంఘంలోని సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ వివరించారు.
మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సూచనల మేరకు.. ఈ ఎస్సీ వర్గీకరణ అమలులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా.. హైకోర్టు మాజీ న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎస్సీ జనాభా లెక్కలకు సంబంధించి 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఏకసభ్య కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాలని సూచించారు.