తిరుమల శ్రీవారిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. తన జన్మదినం సందర్భంగా స్వామివారి సేవలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఆయన తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ కూటమికి ఉన్న విజయావకాశాలపై తన మనసులో మాట చెప్పారు. అలాగే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ ఉందన్నారు.. కాంగ్రెస్‌కు మెజార్టీ స్థానాలు రావడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజల నాడి సస్పెన్స్‌గా ఉందని.. రెండోసారి వైఎస్సార్‌సీపీకి అధికారం ఇస్తారా.. ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారా అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతుందన్నారు. ఏ సర్వేలోనూ ప్రజా నాడి బయటకు రాలేదన్నారు. అందుకే తాను కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తన అంచనానను చెప్పలేకపోతున్నానన్నారు.
తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాత్రమే గట్టి పోటీ ఉంటుందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు సమానంగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కచ్చితంగా గెలవబోతున్నారని.. భవిష్యత్‌ని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ప్రజలు మంచి తీర్పు ఇస్తారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పాతాళంలోకి వెళ్లిపోయిందని.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ప్రజలు తమవైపే ఉన్నారన్నారు. మెజార్టీ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమాను వ్యక్తం చేశారు. ఇండియా కూటమి బలంగా పుంజుకుందని.. బీజేపీకి అంత ఈజీగా లేదన్నారు కోమటిరెడ్డి. దేశవ్యాప్తంగా చూస్తే.. మొదట్లో బీజేపీ హావా కొనసాగిందని.. ఆ తర్వాత ఉత్తరాదిన కాంగ్రెస్, ఇండియా కూటమి బాగా పుంజుకున్నట్లు చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి.