ఆదిలాబాద్అ, మ్మన్యూస్ ప్రతినిధి: ట్రిపుల్ ఎస్‌లుగా పేరుగాంచిన నేతలను, పార్టీ నుండి సస్పెండ్‌కు గురైన అసమ్మతివాదులను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఆగ్రహ జ్వాలలు భగ్గుమన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి పార్టీ నుంచి సస్పెండ్‌కు గురైన అసమ్మతి నేతలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం తగదని, వెంటనే వారిని బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కంది శ్రీనివాసరెడ్డి మద్దతుదారులు ఆందోళన బాట పట్టారు. పట్టణంలోని ఆర్ఎస్ గార్డెన్ సమీపంలో టెంట్ వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ అల్లూరి సంజీవ్‌రెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా పెద్దఎత్తున తరలివచ్చిన ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంది శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి పార్టీ నుంచి బయటకు వెళ్లినవారు రెబెల్‌గా సంజీవ్‌రెడ్డిని బరిలో నిలిపి కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌తో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీకి తీరని ద్రోహం చేశారన్నారు.అంతేకాకుండా టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డిపై ఆనాడు పరుషపదజాలంతో దూషించడమే కాకుండా డబ్బులకు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారంటూ విమర్శించడం నిజం కాదా..? అంటూ ప్రశ్నించారు.
అయినా వెనుకడుగు వేయకుండా కంది శ్రీనివాసరెడ్డి ప్రజల ఆశీర్వదాదంతో వారి మెప్పుపొంది ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఓట్లు సాధించి దమ్మున్న లీడర్‌గా ఎదిగారన్నారు. ఇవాళ ఆయన నాయకత్వంలో అందరూ కలిసి కట్టుగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏమాత్రమూ సిగ్గులేకుండా పార్టీకి ద్రోహం చేసిన ఆ ముగ్గురు నేతలు (సాజిద్‌ఖాన్, సంజీవ్‌రెడ్డి, సుజాత) మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్ట అధిష్టానం వీరి విషయంలో పునరాలోచన చేసి వెంటనే వారిని పార్టీ నుండి బహిష్కరించాలని, ఆరేళ్లపాటు విధించిన సస్పెన్షన్‌ను యథావిధిగా కొనసాగించాలని వారంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. లేనియెడలా ఆందోళనలు మరింత ఉధృతం చేయడమే కాకుండా అవసరమైన పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.
రాత్రి ముగ్గురు బహిష్కృత నేతల దిష్టిబొమ్మ దహనం
కాంగ్రెస్‌లో అసమ్మతి నేతలు సాజిద్‌ఖాన్, సుజాత, సంజీవ్‌రెడ్డి కాంగ్రెస్‌లో తిరిగి చేరడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ శ్రేణులు, కంది శ్రీనివాసరెడ్డి మద్దతుదారులు నిరసన చేపట్టారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి ఆందోళనకు దిగారు. ముగ్గురు ఫొటోలు కలిగిన దిష్టిబొమ్మను దహనం చేసి వారికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెన్ను పోటు పొడిచిన ద్రోహులను ఎలా చేర్చుకుంటారంటూ ప్రశ్నించారు. అధిష్టాన పెద్దలు పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీరి ఆందోళనతో కాంగ్రెస్ పార్టీలో మరోసారి అసంతృప్తి జ్వాలలు బయటపడ్డాయి. ఆ ముగ్గురు నేతలపై ఎత్తివేసిన సస్పెన్షన్ ను కొనసాగించాలని, పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకోవద్దని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుడిపెల్లి నగేస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, కౌన్సిలర్లు దర్శనాల లక్ష్మణ్, సాయిప్రణయ్, జాఫర్ హుస్సేన్, ఆనంద్, నాయకులు బాయిన్‌వార్ గంగారెడ్డి, తమ్మలవార్ చందు, శ్రావణ్ నాయక్, రాషద్ ఉల్ హక్,ఎంఏ.షకిల్, మహ్మద్ రఫిక్, చంటి, మహిళా నాయకులు సంగీత, సోని, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.