మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి నిరసన సెగ తగిలింది. ప్రచారంలో భాగంగా ఆయన రథ చక్రాన్ని అడ్డుకున్నారు గ్రామస్థులు. అంతేకాకుండా అభ్యర్థి ఫోటోకు చెప్పుల దండ వేసి నిరసనలు తెలిపారు. ఈ సంఘటన మిరుదొడ్డి మండలం కాసులబాద్‌లో జరిగింది. అయితే గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, 78 వార్డు బూత్ అధ్యక్షుడు యాదగిరి గ్రామంలోకి వచ్చిన ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రచార రథాన్ని అడ్డుకున్నాడు. అంతటితో ఆగకుండా కొందరు మహిళలతో కలిసి ఆయన చిత్రపటానికి చెప్పుల దండను వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కేసీఆర్ సొంత జిల్లాలోనే బీఆర్‌ఎస్ పరిస్థితి ఈ విధంగా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కేసీఆర్ ఇంటి వద్ద డబుల్ బెడ్ రూం లబ్ధిదారులు ఆందోళనకు దిగింది తెలిసిన విషయమే. ఎన్నికల ముందు ప్రతిపక్ష బీఆర్ఎస్ నిరసనలు ఎదురుకావడం రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
