ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త.. అనంతరం బైక్ మీద పారిపోతూ లారీని ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. భరత్ అరుణ్ అనే యువకుడికి బాల్కొండకు చెందిన దీప్తి అనే అమ్మాయితో నాలుగు నెలల క్రితమే వివాహమైంది. ఏమైందో తెలీదు గానీ.. కొద్ది రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
శుక్రవారం కూడా వీరిద్దరి మధ్య గొడవ జరగ్గా కోపం పట్టలేకపోయిన అరుణ్ భార్యను హత్య చేశాడు. అనంతరం బైక్ మీద పారిపోతుండగా.. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అతడు ఘటనా స్థలంలోనే కన్నమూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
క్షణికావేశంలో భార్యను చంపిన భర్త.. కాసేపటికే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. భార్యను చంపి.. తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో.. టెన్షన్‌కు లోనైన భరత్.. లారీని ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయాడు.