అంబర్‌పేటలో హృదయవిదారక ఘటన
హైదరాబాద్: నాలుగేళ్ల బాలుడిని వీధికుక్కలు పీక్కుతిన్నాయి. ఈ హృదయవిదారక ఘటన నగరంలోని అంబర్‌పేటలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలానికి చెందిన గంగాధర్ తన కుటుంబంతో హైదరాబాద్‌కు వలస వచ్చాడు. భార్య, ఆరేళ్ల కుమార్తె, కుమారుడు ప్రదీప్‌తో కలిసి బాగ్ అంబర్‌పేట ఎరుకల బస్తీలో నివాసం ఉంటున్నాడు. ఛే నంబర్ చౌరస్తాలో కారు సర్వీసింగ్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. తన ఇద్దరు పిల్లలను సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లాడు. గంగాధర్ పనిలో నిమగ్నమవ్వగా నాలుగేళ్ల ప్రదీప్ వీధిలోకి వెళ్లాడు. దీంతో అక్కడున్న వీధి కుక్కలు బాలుడిని చుట్టుముట్టి దాడి చేశాయి. తప్పించుకోవడానికి ప్రయత్నించినా ప్రాణాలు కోల్పోయాడు.
విషయం తెలుసుకున్న వెంటనే గంగాధర్ హుటాహుటిన అక్కడికి చేరుకుని కుక్కలను వెల్లగొట్టటంతో బాలుడిని వదిలి పారిపోయాయి. కానీ అప్పటికే.. ఆ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. కొడుకును తీసుకుని ఆసుపత్రికి తరలించాడు. బాలుడిని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.