27న ఎదుర్కోలు, 28న కల్యాణం, మార్చి 1న రథోత్సవం
పట్టు వస్త్రాలు సమర్పించనున్న కేసీఆర్ దంపతులు
హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 3 వరకు 11 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు మంగళవారం ఉదయం 10 గంటలకు ఆగమ శాస్త్ర రీతిలో శ్రీకారం చుట్టారు. స్వామివారి విశేష అలంకారాలు, దివ్యవాహన సేవలు ఆలయ పునర్నిర్మాణం అనంతరం తొలిసారిగా ఈ ఏడాది ప్రధానాలయ ప్రాంగణంలోనే జరుగుతుండటంతో ఆధ్యాత్మిక శోభ సంతరించేకునేలా చలువ పందిళ్లు, విద్యుత్ కాంతులు విరజిల్లేలా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు హాజరుకానుండడంతో అందుకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నారు. ఈ నెల 28న నిర్వహించే తిరుకల్యాణ వేడుకలకు సీఎం కేసీఆర్ దంపతులు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఉత్సవాల చివరి రోజు 3న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రికి డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.