ఇవి చూస్తుంటే సినిమా విలన్లు కూడా సరిపోరేమో…
బీజేపీ నేత జీవిత రాజశేఖర్
సిద్దిపేట: రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు సాగిస్తున్న అరాచకాలు చూస్తుంటే సినిమా విలన్లు కూడా సరిపోరని బీజేపీ నేత జీవిత రాజశేఖర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జీవిత రాజశేఖర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో కంట్లో నీళ్లు మాత్రమే మిగిలాయని, ఎలాంటి పనులు జరగలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీనే గెలిపిద్దామని ఆమె పిలుపునిచ్చారు. అందరూ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు 6359119119 నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. జిల్లాలోని కోమటి చెరువులో మిషన్ భగీరథ పథకంలో అవినీతి జరిగిందని బీజేపీ నేత ఆరోపించారు.
రాష్ట్రం బంగారు తెలంగాణగా కాలేదు కానీ కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారిందని వ్యాఖ్యలు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు హరీష్ రావు అనుచరులకు మాత్రమే పంపిణీ చేయడంతోనే ఆటో డ్రైవర్ రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ధరణిలో అన్నీ అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. హరితహరం పేరుతో అక్రమాలు చేశారని మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అగ్రరాజ్యాంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని జీవిత రాజశేఖర్ కోరారు.