అలనాటి అందాల నటి శ్రీదేవి వర్ధంతిని పురస్కరించుకుని చనిపోవడానికి ముందు ఆమె తీసుకున్న చివరి ఫొటోను ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీకపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2018 ఫిబ్రవరి 24న తమ బంధువు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు యుఏఈ వెళ్లిన శ్రీదేవి తాను బసచేసిన హోటల్లో బాత్‌టబ్‌లో మునిగి మరణించిన విషయం తెలిసిందే. ఆమె వర్ధంతికి ఒకరోజు ముందు గురువారం బోనీ కపూర్ తన భార్య ఫొటోను పోస్ట్ చేస్తూ చివరి చిత్రం అంటూ రాసుకొచ్చారు.
ఈ ఫోటోలో శ్రీదేవి, బోనీ కపూర్, వారి కుమార్త జాన్వి కపూర్‌తోపాటు ఇతర బంధువులు ఉన్నారు. కొద్ది రోజుల ముందు శ్రీదేవి చిత్రాన్ని పోస్ట్ చేసిన బోనీ కపూర్ ఆమెను స్మరించుకున్నారు. 5 సంవత్సరాల క్రితం నీవు మమల్ని విడిచివెళ్లావు..నీ ప్రేమ, జ్ఞాపకాలు మమల్ని వదిలిపోలేదు..అవి జీవితాంతం మాతోనే ఉంటాయి అంటూ భావోద్వేగంతో ఆయన తన భార్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. తన ఇన్ స్టాలో శ్రీదేవికి చెందిన మరో ఫొటోను కూడా షేర్ చేసిన బోనీ కపూర్ నన్ను వదిలి వెళ్లిపోయిన వ్యక్తి నాతోనే ఇప్పటికీ ఉంది అంటూ రాసుకొచ్చారు.